కృత్రిమ పండుగ వాతావరణం లో నేటి యువత




దేవుడు తోటి మానవుని రూపంలో

పుట్టిన ప్రతి వానికీ గిట్టే వరకూ సమయానికి భోజనాన్ని సమకూర్చుకోవడానికి ప్రతి ఒక్కరికీ తగిన పనిని కల్పిస్తూ దేవుడు అందరికీ సహాయ పడుతున్నారు. చిన్న తనంలో తల్లి దండ్రుల రూపంలో, చదువులలో గురువుల రూపంలో సహాయపడుతూ చదువు పూర్తయ్యాక ఉద్యోగం లేదా వ్యాపారాలను కల్పించి దేవుడు ప్రతి ఒక్కరినీ సంరక్షిస్తున్నారు. తమకు లభించిన స్థాయిని బట్టి తగిన జోడీతో వివాహ బంధంతో ముడివేసి, తదుపరి కలిగిన పిల్లల సంరక్షణ భాద్యతలతో అంతులేని కథ లా నడుపుతున్న దేవుని సృష్టి లయలు ఎంత గొప్పగా ఉన్నవో కదా! కష్ట నష్టాలు, అపజయాలు నుండి దేవుడు తోటి మానవుని రూపంలో దానవుడు గా ఆదుకుంటున్నారు.


కష్ట నష్టాలు, అపజయాలు

మనసున్న మనిషికి కష్ట నష్టాలు, అపజయాలు లేకుండా ఉండవు. కష్ట నష్టాలు, అపజయాలు ఎదురైతే, మనస్సులో అయిష్టతలను, చేదు అనుభవాలను పెట్టుకోకుండా సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు ప్రేమ భావనా భక్తిని పెంపొందించుకొన్న వానికి తోటి మానవుడే దానవుడు గా ప్రత్యక్షమై వరాలను ఇస్తున్నారు, ప్రేమలను పంచుతున్నారు. ఏదైనా సమస్యల వలయంలో చిక్కి, ఆ సమస్యల నుండి బయట పడటానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న వానికి తమ బంధు మిత్రులు "నారు పోసిన వాడు నీరు పోయడా" అనే సామెతను నిజం చేస్తూ,  ధైర్యం చెబుతూ తమకు తోచిన సహాయాన్ని అందిస్తూ, సమస్యల వలయం నుండి తోటి వానిని బయటకు రప్పిస్తున్న ఎందరెందరో మహానుభావులు ఉన్న సమాజంలో మనం నివసిస్తున్నాం. శ్రమ పడిన వానికి జీవితం వృధా కాదు. మంచి ఫలితాలు లభిస్తాయి తను చేసే పనులకు ఎన్నడూ స్వస్తి పలకకూడదు.


కృత్రిమ పండుగ వాతావరణం లో అనారోగ్యం

సమస్త సృష్టికి లయకారుడై అందరినీ నడిపిస్తున్న దేవునికి వందనములు తెలియ జేసుకుంటూ... చిరస్మరణీయం గా మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు అనేక పండుగలకు నిలయంగా ఉండి నేటి తరం వారు కృత్రిమ పండుగ వాతావరణం లో అనారోగ్యం వైపు నడుస్తున్న విషయాన్ని మీ ముందుంచుతున్నాను.


పండుగలు అనగానే గుర్తుకు వచ్చేది

పండుగలు అనగానే నాటి తరం వారికి వెంటనే గుర్తుకు వచ్చేది ఇంటిని శుభ్రం చేసుకోవడం, పిండి వంటలు, క్రొత్త బట్టలు, గుళ్ళు గోపురాలకు వెళ్ళడం. ప్రతి పండుగకు పదునైదు రోజుల ముందునుండే హడా వుడి మొదలవుతుంది అందరి ఇళ్ళలో. ప్రతి ఒక్కరూ ఇంట్లో అటు నిటు గా నున్నవి అన్నీ చక్కగా సర్ధి శుభ్రం చేసి, ఇంటిని ఆవు పేడ లేదా గేద పేడ తో అలికి ఆరిన తర్వాత చక్కని ముగ్గులు వేసే వారు.






పేడతో అలకడమా?

పేడతో అలకడమా? - అంటే ఇప్పటి తరం వారికి తెలియక పోవచ్చు. అప్పట్లో అంటే 1970 సంవత్సరం వరకూ, పల్లెటూళ్ళూ, గ్రామ పంచాయితీలు మున్సిపాలిటీలు, తాలుకా పరిధిలో ఉన్న ఇండ్లన్నీ ఒకటీ రెండు డాబాలు తప్పితే మిగిలినవన్నీ పూరి గుడిసెలు లేదా మట్టి మిద్దెలు. అవి బండలు లేని మట్టి నేలతో ఉంటాయి. పండుగ సందర్భాలలోనే కాకుండా, నిత్యం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఇంటిలో మరియు ఇంటి ముందు ఆవు పేడ లేదా గేద పేడ ను నీటిలో కలిపి కలాపి చల్లి ముగ్గులు వేసే వారు. అనేక పండుగలకు నిలయమైన మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతి పండుగ ఒక్కొక్క ప్రత్యేకతతో ఉంటుంది.


సంక్రాంతి


పెద్ద పండుగ సంక్రాంతి

పండుగలన్నింటిలో అతి ముఖ్యమయినది, అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ ను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు. ధనుర్మాసం లోనే రైతుల ఇంటికి పంట చేరడం తో, సంక్రాంతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతున్నది. డూడూ బసవన్నలు గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, చలి మంటలు, కోలాటాల భజనలు, పిండి వంటలు, కోడి పందాలు, బొమ్మల కొలువులు, పీట ముగ్గులు, ప్రభ ముగ్గులు, రధం ముగ్గులు వంటి రంగవల్లులతో సంక్రాంతి ప్రవేశించిన దనుర్మాసం మొత్తం అట్టహాసంగా జరుగుతుంది. సంక్రాంతి నాలుగు రోజుల పండుగ. సంక్రాంతి తొలి రోజు బోగి పండుగ అని, రెండో రోజు మకర సంక్రాంతి పండుగ గా, మూడో రోజును కనుమ పండుగ గా పిలుస్తారు. నాలుగో రోజును ముక్కనుమ అంటూ నాలుగు రోజులు పండుగ చేసుకుంటారు.


కుటుంబ సభ్యులు అందరూ కలిసే పండుగ

వివిధ ప్రాంతాలలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఒక చోటికి చేరతారు ముఖ్యంగా పెళ్ళయిన కూతుళ్ళూ అల్లుళ్ళ విషయాలలో ఏ లోటూ లేకుండా అనేక కానుకులను ఇస్తుంటారు. ఇంటి ముందు ధనుర్మాసంలో ప్రతి రోజూ ముగ్గులు వేయటం వంటి విషయంలో ప్రతి గృహిణీ పోటీ తత్వంతో ఉంటారు. ఆ పోటీ తత్వం ఏమిటంటే? ఈ వీధిలో వేసిన ముగ్గులు అన్నింటిలోకీ నా ముగ్గే బాగుండాలని, రకరకాల రంగులను అద్ది ముగ్గులను అత్యంత అందంగా చేసి గొబ్బెమ్మలను ఉంచుతారు. అయితే నేడు పేడతో అలకడం కళ్ళాపి చల్లడం వంటి విషయాలన్నీ కనుమరగై పోయాయి. దీనికి కారణం ప్రతి గ్రామం పల్లెటూరు సయితం పూరిళ్ళు లేని అపార్ట్‍మెంట్స్ తో మార్పు చెందడమే.


వినాయక చవితి


ప్రతి ఒక్కరూ ఎదురు చూసే పండుగ వినాయక చవితి

నాడు వినాయక చవితి పండుగ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుండే వారే. వారిలో నేను కూడా ఒకడిని. వినాయక చవితి రోజు ఉదయం స్నానం చేసి ఒక పెద్ద సంచిని భుజాన వేసుకొని పొలాల గట్లపై నడుస్తూ వినాయకుని పూజ కోసం కావలసిన 21 రకాల పత్రిని స్వయంగా కోసుకొని తీసుకు రావటం వంటి విషయం నాకు చాలా సంతోషంగా ఉండేది. అప్పట్లో నా చిన్నప్పుడు పొలాల గట్లపై ప్రకృతి వాతావరణంలో నడవడం.


ఉండ్రాళ్ళు, బొబ్బట్లు, పాయసం

తర్వాత పూజ కాగానే ఉండ్రాళ్ళు, బొబ్బట్లు, పాయసం మరింతగా మెక్కడం వంటి విషయాల వలన వినాయక చవితి అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకే కాదండీ అప్పటి నా తోటీ సహ మిత్రులందరికీ కూడా వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టం.  అయితే నేడు నేటి తరం వారు వినాయకుని పూజ కోసం కావలసిన 21 రకాల పత్రిని స్వయంగా సేకరించకుండా, అంగడిలో అమ్ముతున్న పత్రిని కొనుగోలు చేసి గణపతి పూజ చేస్తున్నారు.


దీపావళి


ప్రతి ఒక్కరికీ ముఖ్యమయిన పండుగ దీపావళి

నాడు దీపావళి అంటే ప్రతి ఒక్కరికీ ముఖ్యమయిన పండుగ కారణం టపాసులు, బాణసంచా కాల్చడం వంటి విషయం వలన, పోటీ తత్వంతో మరీ ఎక్కువగా దీపావళి బాణసంచా కాల్చేవారు అప్పట్లో. అయితే నేడు ప్రకృతి వాతావారణం కలుషితం అవడం వలన నేటి తరం వారు దీపావళి బాణసంచా వాడకంలో వెనుకబడి పోయారు.


ఉగాది


సంవత్సర ఆరంభం

తెలుగు వారికి ఉగాది సంవత్సర ఆరంభ పండుగ.    సంవత్సర ఆరంభాన్ని  మన తెలుగు వారు ఉగాది లేదా యుగాది లేదా సంవత్సరాది అని మూడు పేర్లతో పిలుస్తున్నారు. ఉగాది పండుగనాడు అభ్యంగన స్నానమాచరించి, క్రొత్త బట్టలు కట్టుకొని ఇంటిలో లేదా దేవాలయంలో దేవతా పూజ చేసిన తదుపరి ముందుగా షడృచులతో చేసిన ఉగాది పచ్చడి తిని తదుపరి పంచభక్ష్య పరమాన్నాలు, పిండి వంటలతో కుటుంబ సభ్యులంతా కలసి భోజనం చేయడం ఆనవాయితి గా ఉన్నది. ప్రతి ఒక్కరూ ఉగాది రోజు సాయంవేళ పంచాంగం విని తమ భవిష్య సంవత్సర కాల విశేషాలు తెలుసుకోవడం సదాచారం


మన ఆరోగ్యం కొరకు పండుగలు

పండుగ సాంప్రదాయాలు అన్నీ మన ఆరోగ్యం కోసమే. పండుగలు, ఉత్సవాల రూపంలో పాటించే ఆచారాలు, వ్రతాలు అన్నీ మన ఆరోగ్యం కోసమే. ఉగాది పచ్చడి సంవత్సరానికి తగినంత ఔషధ గుణాన్ని మన శరీరానికి అందింస్తుంది. వినాయక చవితి రోజు గణపతి పూజకు ఉపయోగించే 21 రకాల పత్రి ఔషధ గుణాలతో ఉండటం వలన సంవత్సరానికి ఒక రొజే వాటిని పట్టుకొని పూజ చేస్తున్నప్పటికీ అయినా సరే అవి మనలకు కొంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. దీపావళి బాణసంచా వెలుగుల వలన మన ఆరోగ్యానికి హాని చేసే పురుగులు దోమలు నశిస్తున్నాయి. ప్రతి పండుగకూ ఇంటిని అలికి శుభ్రం చేస్తుండం, క్రొత్త బట్టలు ధరించడం, రొటీన్ లైఫ్ కు భిన్నంగా పండుగ రోజు వివిధ కొత్త రకాల పిండి వంటలు, అరిశలు, బొబ్బట్లు, పాయసాల తో భోజనం చేయటం వంటి విషయాలు ప్రతి ఒక్కరి ఆరోగ్యం మంచిగా ఉండటానికే మన పూర్వీకులు విధించిన పండుగ సాంప్రదాయాలు. అయితే నేడు రెడీమెడ్ గా స్వీట్ షాప్ లలో దొరుకుతున్న పిండి వంటలు, అరిశలు, బొబ్బట్లు, పాయసాలు తింటూ ప్రతి రోజూ కృత్రిమ పండుగ వాతావరణం కల్పించుకుంటున్న నేటి తరం అనారోగ్యం వైపు నడుస్తున్నది.


నేను వ్రాసిన మరి కొన్ని బ్లాగుల లింకులను క్రింద ఇస్తున్నాను, వాటిపై క్లిక్ చేసి వీక్షించవలసినదిగా కోరుచున్నాను.


Bandla App image
Bandla App image
Bandla App image
Bandla App image
మరిన్ని వ్యాసాలు, బ్లాగులకు క్లిక్ చేయండి